ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గురువారం ఓ విద్యార్థి జూనియర్ కళాశాల భవనంలోని మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా బత్తెనపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్‌గా గుర్తించారు. గురువారం ఉదయం 9:30 గంటలకు చరణ్ కాలేజీకి వచ్చాడు. క్లాస్ జరుగుతుండగా 11:55 గంటల సమయంలో అతడు అకస్మాత్తుగా తరగతి గది నుండి బయటకు వచ్చి మూడవ అంతస్తు నుండి దూకాడు ”అని అనంతపురం రూరల్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి టి వెంకటేశులు పిటిఐకి తెలిపారు.
వెంటనే కళాశాల యాజమాన్యం గాయపడిన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఆత్మహత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలలో రికార్డయ్యాయి. వీడియోలో విద్యార్థి తన బెంచ్ నుండి పైకి లేచి నేరుగా క్లాస్ బయటకు వెళ్లి మూడవ అంతస్తు నుండి దూకాడు. అది చూసిన తోటి విద్యార్ధులు, లెక్చరర్ కంగారుతో క్లాసులో నుంచి వెళ్లడం వీడియోలో రికార్డయ్యింది. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.