జులైలో ఇంటర్ పరీక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
Inter Exams In July First Week. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యాశాఖ జులైలో పరీక్షలు నిర్వహించాలని
By Medi Samrat Published on 15 Jun 2021 6:08 PM ISTఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యాశాఖ జులైలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు నిర్వహణ అని మంత్రి తెలిపారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఇప్పటికే పలుమార్లు పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రతిఫక్షాలు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శలు చేశాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వహణకు ముందుకెళ్తున్నామని తెలిపింది. తాజాగా పరీక్షలపై మంత్రి మాట్లాడటంతో.. రాష్ట్రంలో మరోమారు ఈ అంశం చర్చనీయాంశం కానుంది.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ నెల 20న కర్ఫ్యూ ముగుస్తుంది. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. అంటే కర్ఫ్యూ తర్వాత పరీక్షలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవనున్నారు. వచ్చే నెల ఇంటర్ పరీక్షలు పూర్తయితే.. ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.