విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్

విజయవాడ – సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్‌ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది.

By -  Medi Samrat
Published on : 11 Oct 2025 8:30 PM IST

విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్

విజయవాడ – సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్‌ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలకమైన పాత్ర పోషించారు. తాజాగా ఈ సర్వీసుకు సంబంధించి వివరాలను రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు.

విజయవాడ నుండి వారానికి మూడు సార్లు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉండనుందని.. ఈ నవంబర్ 15 నుండి ఈ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి మూడు సార్లు ఈ విమాన సర్వీసు స్థానికులకు సేవలందించనుంది.

కాగా ఇదే సర్వీసు విషయమై ఈ సంవత్సరం జులై 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సమయంలో ప్రస్తావన వచ్చినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు.. వందరోజులోనే సర్వీసును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమైనదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు.. తన విజన్ ను స్పష్టంగా అమలుచేస్తున్న నేపథ్యంలో విమానయాన అవసరాలు పెరగనున్నాయనీ.. భవిష్యత్ లో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు. పౌర విమానయాన అభివృద్ధిలో విప్లవాత్మక ముందడుగుగా విజయవాడ ప్రాంతవాసులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థి సంఘాలు.. ఈ సర్వీసు పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన, ఆలోచన మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నూతన విమాన సర్వీసు ఏర్పాటుకు రామ్మోహన్ నాయుడు మరింత చొరవ తీసుకున్నారు. ఇది కేవలం విజయవాడకే కాకుండా, తూర్పు ఆంధ్ర ప్రజలకు కూడా వరంగా మారనుంది. సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరానికి ప్రత్యక్ష కనెక్షన్ లభించడంతో విజయవాడ – గుంటూరు ప్రాంతాల విద్యార్థులకు, పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు, పర్యాటకులకు నూతన అవకాశాలు ఏర్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ నగరం అమరావతి రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ కనెక్టివి మరింత లాభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగావకాశాల కోసం, ఉన్నత విద్య కోసం అంతర్జాతీయంగా ప్రయాణించే యువతకి ఇది గొప్ప వారధిగా మారనుంది.

నూతన విమాన సర్వీస్ అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికులు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కింజరాపు రామ్మోహన్ నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నుండి మల‍్టిపుల్ టైమింగ్స్‌తో ప్రయోజనం పొందేలా ఇండిగో సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రజా విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ టైమింగ్స్‌ను రూపొందించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ అభివృద్ధి సాధించేందుకు ఈ విమాన సర్వీసు దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ రూట్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story