దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. స్టేడియంలో ఏపీ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించింది. సీఎం జగన్.. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం.. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని సీఎం అన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని పేర్కొన్నారు. మన స్వాతంత్య్రానికి, అతి పెద్ద ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీక అని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది అని అన్నారు.
75 ఏళ్లలో స్వాతంత్ర్య భారతవని ఎన్నో తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. ప్రపంచంతో పోటీ పడి మరీ భారత్ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్‌లో కొనసాగుతోందని సీఎం జగన్ గుర్తుచేశారు.