అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వర్సిటీ, వచ్చే ఏడాదిలో అడ్మిషన్లు: మంత్రి లోకేశ్
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు
By - Knakam Karthik |
అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వర్సిటీ, వచ్చే ఏడాదిలో అడ్మిషన్లు: మంత్రి లోకేశ్
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వ్యక్తిగతంగా తీసుకుని ఎపికి IIULER మంజూరు చేయించారు. శాసనసభ తరపున గవర్నర్ గారికి ధన్యావాదాలు. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ (ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని లోకేష్ చెప్పారు.
ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIULER), ఎపి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఇందులో అడ్మిషన్లను కూడా 2025-26 లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో 20శాతం రాష్ట్రంలోనే స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపర్చాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పిజి, పిహెచ్ డి వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగుళూరులో ఏర్పాటుచేశారు. అది భారతదేశానికి మోడల్ లా యూనివర్సిటీగా తయారైంది. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల్లో లా యూనివర్సిటీలు ఏర్పాటుచేయాలని తీర్మానించారు. న్యాయ పరిశోధనకు మనదేశంలో మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ను ఏర్పాటుచేశారు.
ఈ ట్రస్ట్ ఆధ్వర్యాన ఇప్పటికే గోవాలో IIULER ఏర్పాటుచేసింది. ఈ బోర్డులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సిటీకి అమరావతిలో 55ఎకరాలను చదరపు మీటర్ రూపాయి లీజు చొప్పున కేటాయించాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇందులో రాష్ట్ర కోటా 20శాతం ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వచ్చినపుడు పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. అందుకు అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లాల్సిన ఐఎస్ బిని చంద్రబాబునాయుడు పోటీపడి ఆనాడు హైదరాబాద్ కు తీసుకెళ్లారు. దానివల్ల హైదరాబాద్ లో ఆ ప్రాంత రూపురేఖలు మారాయి. అక్కడ విద్యనభ్యసించిన అన్ని సామాజిక వర్గాల వారు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఎపిలో ప్రతిష్టాత్మక సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.