Rain Alert : రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం..!
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 2:33 PM ISTనైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయుగుండం వాయువ్య దిశగా 12కిమీ వేగంతో కదులుతుందని వెల్లడించారు. చెన్నైకి 360 కి.మీ.. పుదుచ్చేరికి 390 కి.మీ, నెల్లూరుకి 450 కి.మీ దూరంలో ఉందని తెలిపారు. వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం రాయలసీమలోని నెల్లూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, తిరుపతి, చిత్తూరు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురువారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి.. అధికారులతో మాట్లాడి ప్రజలను అప్రమతం చేయాలని సూచించారు.