ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 5 రోజులు తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ వేడిమికి ప్రజలు తీవ్రంగా అల్లాడిపోనున్నారు.
By అంజి Published on 2 Jun 2023 1:00 PM ISTఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 5 రోజులు తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ వేడిమికి ప్రజలు తీవ్రంగా అల్లాడిపోనున్నారు. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని 302 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది . పశ్చిమగోదావరి, పల్నాడు, తిరుపతి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అక్కడ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, ఏలూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అనకాపల్లిలో తేమ శాతం 84 శాతం వరకు ఉండొచ్చని ఐఎండీ పేర్కొంది. అనంతపురం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు, సత్యసాయి, అన్నమయ్య పశ్చిమ ప్రాంతాలు, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి సమయంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడదెబ్బ తగలకుండా పుష్కలంగా ద్రవాలు తాగడం, పగటిపూట శ్రమకు దూరంగా ఉండటం, వదులుగా, లేత రంగు దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ ప్రజలకు సూచించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.