నిరక్షరాస్యులు 30 గంటల్లోనే తెలుగు చదవడం నేర్చుకున్నారు..ఎలా అంటే?
అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎన్‌ఆర్ పద్ధతితో నిరక్షరాస్యులు కేవలం 30 గంటల్లోనే వార్తాపత్రిక చదివే సామర్థ్యాన్ని పొందారు.
By - Knakam Karthik |
అమరావతి: భారతదేశం అక్షరాస్యతలో వెనుకబడి ఉందనేది అందరికీ తెలిసిందే. ప్రభుత్వాల విధానపరమైన కారణాలను పక్కనబెట్టి చూస్తే భారతీయ భాషలు నేర్చకోవటం ఒకవిధంగా సంక్లిష్టమైన విషయం. అక్షరమాల, గుణింతాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు వీటన్నింటినీ కలిపితే దాదాపు 1000 అక్షరాలు అవుతాయి. ఈ వేయి అక్షరాలను గుర్తుపెట్టుకుని మెరుపువేగంతో గ్రహించగలిగితేనే తెలుగును ధారాళంగా చదవగలం. ఈ సంక్లిష్టత కారణంగా సంవత్సరాల తరబడి చదివినా తెలుగు రావటం లేదు. ఈ సమస్యను అధిగమించటానికి నెల్లూరు నరసింహారావు "ఎన్ ఆర్ పద్ధతి" ని ఆవిష్కరించారు.
కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో "ఎన్ ఆర్ పద్ధతితో అలవోకగా తెలుగు నేర్చుకుందాము" అనే పైలట్ ప్రాజెక్ట్ ను నిరక్షరాస్యులైన పదిమంది డ్వాక్రా మహిళలకు ఉయ్యురు మండలం లోని ఆకునూరు గ్రామంలో 2-9-2025 నాడు కృష్ణా జిల్లా వయోజన విద్యాశాఖ సహకారంతో ఉయ్యురు మండల విద్యాశాఖాధికారి ప్రారంభించారు. ఎన్ ఆర్ పద్ధతి" తో బోధించటంవల్ల కేవలం ఒక వారం రోజుల్లో లేక 30గంటల అభ్యసనతో అనేకానేక సమస్యల నడుమ, అత్యంత అననుకూల పరిస్థితులలో నిరక్షరాస్యులకు వార్తాపత్రికలను సైతం చదవగల సామర్థ్యం వచ్చింది. వయోజన అక్షరాస్యతా కార్యక్రమాలలో పేదల చదువుకు పదేపదే ఎదురౌతున్న సమస్య తక్కువ సమయంలో తెలుగును చదవగలిగేలా చేయటం. ఈ విధంగా "ఎన్ ఆర్ పద్ధతి" ఈ సమస్యను అధిగమించింది. ఇదే వేగంతో నిరక్షరాస్యులను చదవగలిగేలా చేస్తే కేవలం ఒకేఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వంద శాతం అక్షరాస్యతను సాధించగలుగుతుంది.
ఈ పద్ధతిలో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి.
మొదటిది: అక్షరాలు గుర్తుండటానికి అక్షరమాలను లయబద్దంగాను, తార్కికంగాను విభజించటం జరిగింది.
రెండవది: నేర్చుకునే ప్రక్రియలో అభ్యాసకుల వాడుక భాషను ఉపయోగించటం.
మూడవది: అభ్యాసకులు అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేసే బోధనా విధానం.