పాస్టర్ ప్రవీణ్ మరణంపై కీలక విషయాలు వెల్లడించిన‌ పోలీసులు

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు.

By Medi Samrat
Published on : 29 March 2025 8:37 PM IST

పాస్టర్ ప్రవీణ్ మరణంపై కీలక విషయాలు వెల్లడించిన‌ పోలీసులు

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. మార్చి 24వ తేదీన పాస్టర్‌ ప్రవీణ్‌ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్‌ నాలుగు గంటలు ఆగారని చెప్పారు. విజయవాడలో ఎవరిని కలిశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రోడ్డుప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. తహసీల్దార్ సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై విచారణ చేశామన్నారు.

కేసు విచారణలో భాగంగా పాస్టర్ ప్రవీణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు బృందాలు, విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మరో రెండు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయన్నారు. బైక్‌ బ్యాలెన్స్‌ తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడం, ప్రవీణ్ ముందుగా పడిపోయిన తర్వాత ఆయన పైన బైక్‌ పడడంతో మృతిచెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై క్రిస్టియన్‌ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story