స్పెషల్ ఇంటర్వ్యూ : కడప ముఖ చిత్రం మార్చాలని అనుకుంటున్నా: రెడ్డెప్పగారి మాధవి

న్యూస్‌మీటర్‌తో సంభాషణలో.. కడప రెడ్డమ్మ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన ధ్యేయమని చెబుతున్నారు. అలాగే కడపలో టీడీపీ సత్తా చాటడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 May 2024 12:37 PM IST
స్పెషల్ ఇంటర్వ్యూ : కడప ముఖ చిత్రం మార్చాలని అనుకుంటున్నా: రెడ్డెప్పగారి మాధవి

కడప: ప్రజలు కడప రెడ్డమ్మ అని పిలుచుకునే కడప అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి, ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీధి వీధికీ తిరుగుతూ, శ్రేణులను కలుపుకుంటూ వెళుతున్నారు.

మూడు దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఏకైక మహిళ. ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన అంజాద్ బాషా పై ఆమె పోరాడుతున్నారు. ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న మాధవిరెడ్డి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాషా హ్యాట్రిక్‌ లక్ష్యంగా పోటీ చేస్తున్నారు.

న్యూస్‌మీటర్‌తో సంభాషణలో.. కడప రెడ్డమ్మ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన ధ్యేయమని చెబుతున్నారు. అలాగే కడపలో టీడీపీ సత్తా చాటడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెబుతున్నారు.

న్యూస్ మీటర్: కడప నుంచి ఇప్పటివరకు మహిళలెవరూ పోటీ చేయలేదనుకుంటాం? మీరు ఒక ఉదాహరణను సెట్ చేసారు. మీ ప్రణాళికలు ఏమిటి?

మాధవి: కడపలో ఇప్పటి వరకు మహిళలెవరూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల ప్రకటనకు ముందే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహిళా అభ్యర్థిని పోటీకి దింపాలని భావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయడమే నా ఏకైక ఫార్ములా. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ నిరసనలు నిర్వహించడం ద్వారా నాయుడు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాము. అదే నాకు ప్రచారంతో సమానం. లోక్‌సభ ఎన్నికల కోసం మా వద్ద ఎలాంటి వ్యూహం లేదు. నేను 10-12 గంటలు పని చేస్తున్నాను. గత ఎనిమిది నెలల్లో నేను 80,000 ఇళ్లను సందర్శించాను.

న్యూస్ మీటర్ : టీడీపీకి కడపలో గెలుపు ఎంత కీలకం?

మాధవి: గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ గెలవలేదు. క్యాడర్ బలంగా లేకపోవడంతో పునర్నిర్మించాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కడపలో తమదే రాజ్యం అని భావించి నాపై, టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయమై పోరాడాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో చాలా భూకబ్జా ఘటనలు చూశాం. కొన్ని సార్లు వైఎస్సార్‌సీపీ మా మామ రాజ్‌గోపాల్‌రెడ్డిని (మాజీ మంత్రి) కూడా విమర్శించింది

న్యూస్ మీటర్: మీ పోటీదారు ఎవరు అని మీరు అనుకుంటున్నారు?

మాధవి: ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. ఆయన ఇష్టానుసారం ఇక్కడ పనులు సాగుతాయి. అదృష్టవశాత్తూ, ఒక మహిళగా అందరి ఇళ్లలోకి ప్రవేశించి వారితో మమేకమయ్యే అవకాశం నాకు లభించింది. మరీ ముఖ్యంగా ప్రజలు చూసేది ఎమ్మెల్యే ముఖం కాదు.. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని సీఎం చేయాలని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

న్యూస్ మీటర్: మూడు దశాబ్దాల తర్వాత కడపలో మైనార్టీయేతర ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది?

మాధవి : ఎమ్మెల్యేగా గెలుస్తాను. కడపలో చాలా మార్పు తీసుకునిరావాలని కోరుకుంటున్నాను, అది ఎమ్మెల్యే సీటు ద్వారానే సాధ్యమవుతుంది. మౌలిక సదుపాయాల కొరత, నిత్యం తాగునీటి సమస్య, గంజాయి ముప్పు, మహిళల భద్రత గురించి నేను మరింత ఆందోళన చెందుతున్నాను. నియోజక వర్గ పరిధిలో ప్రైవేట్ భూముల ఆక్రమణలు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం అధికార వైఎస్సార్సీపీ పార్టీ అండదండలతోనే సాగుతున్నాయి. వీటిని అడ్డుకోవాలి.

న్యూస్ మీటర్: ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది?

మాధవి: ఇది చివరి దశ, నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చాలా కాలం క్రితమే ఇంటింటికీ ప్రచారం పూర్తి చేసాను. ఇప్పుడు, మేము పోలింగ్ రోజు కోసం సిద్ధంగా ఉన్నాము.

మాదవికి కుటుంబ సభ్యుల అండ ఎంతగానో ఉంది. ఆమె భర్త, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అకా వాసు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు.

Next Story