హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్ల నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది. స్థానిక నివేదికల ప్రకారం 2025 మొదటి త్రైమాసికంలో HMRL రూ.5.55 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2017లో హైదరాబాద్ మెట్రో ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం రూ.6598.21 కోట్లు నష్టపోయింది. మొదట్లో హైదరాబాద్ మెట్రోకు సానుకూల స్పందన వచ్చింది. అయితే, 2020-2021లో COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గింది.
అదే సమయంలో, HMRL వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ప్రయాణీకుల సంఖ్య సాధారణ స్థితికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ కలిపితే రూ. 4828.55 కోట్ల నష్టం వాటిల్లింది. HMRL ఆస్తులను మోనటైజేషన్ చేయడం వల్ల గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో నష్టాలు తగ్గాయి. HMRL టికెట్ల అమ్మకాలు, ప్రకటనల ద్వారా రూ.1400 కోట్లు ఆర్జించింది. అయితే, అధిక వడ్డీ రేట్లు HMRL కు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.