శ్రీకాకుళం ఐఐఐటీలో 100 మంది బాలికలకుపైగా అస్వస్థత

Hundreds of students taken ill in IIIT-Srikakulam. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఐఐఐటీ-శ్రీకాకుళంలోని ఐఐఐటీలో ఫుడ్‌ పాయిజన్‌తో పెద్ద సంఖ్యలో

By అంజి  Published on  6 Nov 2022 6:03 AM GMT
శ్రీకాకుళం ఐఐఐటీలో 100 మంది బాలికలకుపైగా అస్వస్థత

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఐఐఐటీ-శ్రీకాకుళంలోని ఐఐఐటీలో ఫుడ్‌ పాయిజన్‌తో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు, బాలికలు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్శిటీ వైద్య బృందం చాలా మంది విద్యార్థులకు చికిత్స అందించింది. విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు ఎక్కువయ్యాయి. 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగినప్పటికీ, అధికారులు క్యాంపస్‌ను సందర్శించడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

16 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ శనివారం ఐఐఐటీ క్యాంపస్‌ను సందర్శించి ఘటనపై విచారణకు ఆదేశించారు. విద్యార్థినిలు అస్వస్థతకు గురి కావడానికి సరైన కారణం తెలియనప్పటికీ సగం ఉడికిన చపాతీ, బంగాళదుంపల కూర తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. క్యాంపస్ అధికారులు ఈ సంఘటనను తక్కువ చేసి చూపారు. అయితే శనివారం ఎక్కువ మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం, క్యాంపస్‌లోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడంతో విషయం బహిరంగంగా మారింది.

కాగా ఆరోగ్య శాఖ ఐఐఐటీ క్యాంపస్‌లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించగా, వైద్యులు వచ్చే ఐదు రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. డీఎమ్‌హెచ్‌వో డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ.. ''ప్రత్యేక వైద్య బృందం రాబోయే ఐదు రోజులు క్యాంపస్‌లో ఉంటుంది. అనారోగ్యానికి కారణాన్ని తెలుసుకోవడానికి మేము మెస్‌ని పరిశీలించాము. నమూనాలను సేకరించాము.'' అని చెప్పారు. విద్యార్థులపై 24 గంటలూ శ్రద్ధ చూపుతామని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Next Story