సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

By Medi Samrat
Published on : 29 Aug 2025 9:21 PM IST

సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన వాదనలతో ఏకీభవించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి. సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం "మిమ్మల్ని మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎవరు ఆపగలరు?" అని ప్రశ్నించింది. భద్రత విషయంలో ఆందోళన ఉంటే, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే సమయంలో ఆయనకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసు భద్రతకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో ధర్మాసనం అంగీకరించింది.

Next Story