Vizag: ఫిషింగ్ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 35 బోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసి ఉన్న 35 మెకనైజ్డ్ బోట్లు దగ్ధమయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2023 8:46 AM ISTVizag: ఫిషింగ్ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 35 బోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసి ఉన్న 35 మెకనైజ్డ్ బోట్లు దగ్ధమయ్యాయి. ఒక బోటు నుంచి చెలరేగిన మంటలు సమీపంలోని ఇతర బోట్లకు వ్యాపించాయి. మంటలు వ్యాపించి పడవలను చుట్టుముట్టడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు భయాందోళనకు గురై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.
బోట్లలోని ఎల్‌పీజీ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలో ప్రయాణించేందుకు బియ్యం, నూనె, ఎల్‌పీజీ సిలిండర్లు, మరికొన్నింటిని పడవల్లో భద్రపరుచుకుంటారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) కె ఆనంద్ రెడ్డి, అతని బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అగ్ని ప్రమాదంలో పలు బోట్లు దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మొత్తం నాలుగు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదిక అందలేదని ఆయన తెలిపారు.
దాదాపు 40 మత్స్యకారుల పడవలు అగ్నికి ఆహుతయ్యాయని, ఒక్కో బోటుకు కనీసం రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో ఇంతవరకు ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ జరగనందున ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదం కావచ్చు.
పడవ సముద్రంలో ప్రయాణానికి సిద్ధమవుతోంది. పడవలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. కొందరు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌తో ఆహారాన్ని తయారుచేస్తుండగా, మరికొందరు ఇంధన ట్యాంక్‌లో డీజిల్ నింపడానికి సిద్ధంగా ఉన్నారు. బోట్ ఆపరేటర్లు భద్రతా ప్రమాణాలు పాటించకుండా జనరేటర్లు, ఇతర గాడ్జెట్‌లను బిగించడానికి వైర్లను ఉపయోగించడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి కారణమై ఉండవచ్చు.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోటు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.