యువ ఐఏఎస్ అధికారిణి ఆలోచ‌న అదుర్స్‌.. రీసైకిల్ చేసిన వ‌స్తువుల‌తో అంగన్‌వాడీ కేంద్రాలలో ఆట వ‌స్తువులు

How young ias officer created 58 upcycled playgrounds anganwadi kids anakapalli. జారే బండల దగ్గర నుండి పిల్లలు ఆడుకునే ఎన్నో ఆట వస్తువులు రీసైకిల్ చేసిన వస్తువులతో తయారు చేసి ఉంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 July 2023 3:00 PM GMT
యువ ఐఏఎస్ అధికారిణి ఆలోచ‌న అదుర్స్‌.. రీసైకిల్ చేసిన వ‌స్తువుల‌తో అంగన్‌వాడీ కేంద్రాలలో ఆట వ‌స్తువులు

జారే బండల దగ్గర నుండి పిల్లలు ఆడుకునే ఎన్నో ఆట వస్తువులు రీసైకిల్ చేసిన వస్తువులతో తయారు చేసి ఉంటే.. అటు పిల్లలకూ ఆనందం.. ఇటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు. అనకాపల్లి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రస్తుతం అలాంటివే ఎక్కువగా ఉన్నాయి.


అనకాపల్లి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆట వస్తువులు వాళ్ల ముందే ఉన్నాయి. అయితే ఇవన్నీ వాడేసిన టైర్లతో తయారు చేసి.. ఆకట్టుకునే రంగులతో డిజైన్ చేసిన వస్తువులు. వ్యర్థాల నుండి ఆడుకునే వస్తువులను తీసుకుని వచ్చిన ఈ ఆలోచన బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిది. అనకాపల్లి అసిస్టెంట్ కలెక్టర్ (యూటీ)గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి ధాత్రిరెడ్డి ఈ ‘ప్రాజెక్ట్ ప్లే’ వెనుక ఉన్నారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో 58 క్రీడా మైదానాలు ఉన్నాయి.


ప్రాజెక్ట్ ప్లే అంటే ఏమిటి?

చిన్న పిల్లల సమగ్ర వికాసానికి అనకాపల్లి జిల్లా యంత్రాంగం తలపెట్టిన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఇది. ఇలాంటి స్కూల్స్ లో ఉండడం వల్ల చిన్న పిల్లలకి స్కూల్స్ పై ఆసక్తి పెంపొందించడమే కాకుండా.. హ్యాపీగా ఆడుకుంటారు. ప్రాజెక్ట్ ప్లే కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలలో మంచి ప్లేగ్రౌండ్‌లు ఉంటాయి. విభిన్న రకాల ఆట వస్తువులను పిల్లలకు ఇవ్వడంపై ప్రాజెక్ట్ ప్లే దృష్టి పెట్టింది.

అలా మొదలైంది?

హైదరాబాద్‌కు చెందిన 2020 బ్యాచ్ IAS అధికారి ధాత్రి. IIT ఖరగ్‌పూర్‌లో B.Tech చేశారు. ఆమె ఇంతకుముందు తెలంగాణలో IPS అధికారిగా పని చేసి, 2022లో అనకాపల్లిలో అసిస్టెంట్ కలెక్టర్ (UT)గా చేరారు. "నేను క్షేత్ర స్థాయి పర్యటనలో ఉన్నప్పుడు అనకాపల్లి రీజియన్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను మెరుగు పరచాలని అనుకున్నాను. పిల్లలకు ఆట స్థలాలు లేవని నేను గమనించాను. సాధారణంగా ప్రీ-స్కూల్స్‌లో పిల్లలు వివిధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఆట స్థలాలు ఉంటాయి. దీంతో నేను NGOలతో మాట్లాడటం ప్రారంభించాను" అని ధాత్రి అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద తక్కువ ధరకు ప్లే ఏరియా నిర్మించాలంటే ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న ధాత్రికి గ్రామీణ నీటి సరఫరా విభాగం వద్ద 35ఎంఎం పాత మెటల్ పైపులు పడేసి ఉండడం కనిపించింది.


"మేము ఆ పారేసిన పైపులను తీసుకొని, స్థానిక దుకాణాల నుండి కొన్ని పాత టైర్లను కొనుగోలు చేసాము. ప్లేగ్రౌండ్ కోసం కొన్ని వస్తువులను తయారు చేయడం ప్రారంభించాము. చాలా కంపెనీలు వాడేసిన టైర్లను పట్టించుకోవు. వాటిని ప్లే ఎలిమెంట్స్ గా మార్చడానికి అప్‌సైకిల్ చేయవచ్చు. దీనికి సహాయం చేసిన పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ విభాగానికి ధన్యవాదాలు," అని ధాత్రి చెప్పారు.

ప్రైవేట్ సంస్థలు నిర్మించే ప్లేగ్రౌండ్‌లకు ఒక్కొక్కటి రూ. 2.5 లక్షలు ఖర్చవుతుండగా, ప్రాజెక్ట్ ప్లే బృందం రూ. 2.5 లక్షలతో ఆరు ప్లేగ్రౌండ్‌లను తయారు చేయగలదు. క్రీడా మైదానం సిద్ధం కాగానే జిల్లా అధికారులు వాటిని స్థానిక అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగిస్తారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమవ్వడానికి జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి కారణమని ధాత్రి పేర్కొన్నారు. నేను అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పటికీ, నా ఆలోచనలను ప్రతిపాదించడానికి, వాటిని అమలు చేయడానికి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మా కలెక్టర్ మద్దతు లేకుండా ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తీ అయ్యేది కాదని ఆమె చెప్పారు.


ధాత్రి మాట్లాడుతూ "మొదటి ఎనిమిది ప్లేగ్రౌండ్‌లు అప్‌సైకిల్ చేసిన మెటీరియల్‌లతో రూపొందించాము. ముఖ్యంగా నాణ్యతపై దృష్టి పెట్టాము. ఇవి కనీసం 4-6 సంవత్సరాల పాటు ఉండేలా పటిష్టంగా ఉన్నాయి. దొంగతనాలు జరగకుండా ప్లేగ్రౌండ్‌లు సురక్షిత ప్రాంతంలో ఉండేలా చూసుకున్నాము. వీటిని చూసిన పిల్లలు ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. మేము వాటికి తుదిమెరుగులు దిద్దకముందే పిల్లలు వాటితో ఆడుకోవడం ప్రారంభించారు. ప్లే ఏరియాను వారు ఎంతగా ఇష్టపడుతున్నారో అప్పుడే మాకు అర్థమైంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలే కాదు, ప్రైవేట్ పాఠశాల పిల్లలు, స్థానిక పిల్లలు కూడా ఆడుకోవడం కోసం వచ్చే వారు. మా ప్లేగ్రౌండ్‌లు ఇప్పుడు పిల్లలందరికీ ఆట స్థలాలుగా మారిపోయాయి" అని అన్నారు.


స్ఫూర్తిదాయకమైన ఆలోచన

ఈ ప్రాజెక్ట్ ను ముఖ్యంగా గ్రామ స్థాయిలో అమలు చేయాలి.. ఇక్కడ పిల్లలకు ఇది చాలా అవసరమని ధాత్రి భావిస్తూ ఉన్నారు. "ఈ ప్లేగ్రౌండ్‌లను ఎలా నిర్మించాలో అనే విషయమై కూడా నేను ఒక పేపర్‌ను సిద్ధం చేస్తున్నాను. వారి ప్రాంతాలలో అదే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుకునే ఏ జిల్లాకు చెందిన వారితోనైనా పంచుకుంటాను. నేను ఏ జిల్లాలో బాధ్యతలు చేపట్టినా ఆ జిల్లాలలో పిల్లల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేయాలనుకుంటున్నాను," అని ధాత్రి తెలిపారు.


Next Story