'ఈగల్' పేరుతో యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ : హోంమంత్రి అనిత

గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు 'ఈగల్' పేరును నిర్ణయించినట్లు హోంమంత్రి వంగపూడి అనిత వెల్లడించారు.

By Kalasani Durgapraveen  Published on  27 Nov 2024 1:00 PM GMT
ఈగల్ పేరుతో యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ : హోంమంత్రి అనిత

గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు 'ఈగల్' పేరును నిర్ణయించినట్లు హోంమంత్రి వంగపూడి అనిత వెల్లడించారు. అక్రమ, అసాంఘిక, సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పేరును సరిగ్గా సూచించారని హోంమంత్రి పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రుల సబ్ కమిటీలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్నీ పూర్తిగా నిరోధిస్తామని ఆమె స్పష్టం చేశారు. 'మహా సంకల్పం' పేరుతో భారీ అవగాహన సదస్సుల నిర్వహణకు కసరత్తు జరుగుతోందన్నారు.

స్లోగన్స్, ప్లెడ్జ్ లతో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్య చేసి పెద్దఎత్తున క్యాంపెయిన్లు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అవగాహన సదస్సులతో పాటు ఐ అండ్ పీఆర్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి ప్రక్షాళన చేపడతామన్నారు.

ముఖ్యమంత్రి చేతులమీదుగా త్వరలోనే 'ఈగల్ 1972' టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ గురించిన సమాచారం తెలియపరచినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. గంజాయి సాగు, సరఫరాపై డేగకన్నేసి నిశితంగా నిఘా పెట్టనున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ గమ్యస్థానాలను అంతమొందిస్తామన్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలను మట్టుబెడతామన్నారు.

అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నామన్నారు. జీపీఎస్, ఆర్ఎఫ్ఐడీ, ట్రాకింగ్ సిస్టం, ఏఐ ఆధారిత సీసీ నిఘా,ఫేసియల్ రికగ్నిషన్, ప్రొఫైలింగ్, సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్, ఐటీ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీస్, జీఏడీ,వైద్య,అటవీశాఖ,జిల్లాలలోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో తుదముట్టించనున్నట్లు చెప్పారు. విద్య, మున్సిపల్, రవాణా, యువజన,గిరిజన శాఖల సహకారంతో ముందుకు వెళతామన్నారు. రాబోయే ఆరు నెలల్లో గంజాయిని అంతమొందించే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టిసారిస్తామని హోంమంత్రి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ , వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, స్త్రీ,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భాగస్వామ్యమయ్యారు.

Next Story