మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది : హోం మంత్రి

Home Minister Thaneti Vanitha Fire On TDP. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని

By Medi Samrat  Published on  9 Aug 2022 12:43 PM GMT
మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది : హోం మంత్రి

మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. తప్పు చేసినట్టు నిరూపణ అయితే కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో.. అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా, తన, మన అన్న తారతమ్యం లేకుండా, తప్పును తప్పుగానే చూస్తామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ కుట్ర కోణంలో భాగంగా, ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే.. వారిపైన కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళల ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా, ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదం అని అన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా ప్రభుత్వం ఎంపీని కాపాడుతున్నట్టు, బాధిత మహిళకు అన్యాయం చేస్తున్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటున్న మహిళలు వాడుతున్న భాష రాష్ట్రంలోని మహిళలంతా సిగ్గుపడే విధంగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా.. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా, మహిళల భద్రత, మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మహిళా సాధికారత కోసం.. నిరంతరం తపిస్తూ, చక్కటి పరిపాలనను అందిస్తుంటే.. చూసి ఓర్వలేక టీడీపీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తుందని అన్నారు. మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై గానీ, ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంపైగానీ విమర్శలు చేయడానికి ఏ అంశాలు లేవు కాబట్టే, ఇటువంటి చౌకబారు వీడియోలను పట్టుకుని, మహిళలను అడ్డు పెట్టుకుని జుగుప్సాకరమైన రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని ఫైర్ అయ్యారు. వ్యక్తులుగా జరిగిన చిన్న విషయాలను పట్టుకుని నానా యాగీ చేస్తున్నారు.

వీడియోపై సంబంధిత ఎంపీనే కంప్లైంట్ చేశాడు.. అది మార్ఫింగ్ వీడియో అని.. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అతను తప్పు చేశాడు అని నిర్థారణ అయితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మహిళలకు న్యాయం చేయటానికి, మహిళల గౌరవం కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు. అందులో ఎవరూ సందేహపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు.



Next Story