పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అధికారులను అప్రమత్తం చేసిన హోం మంత్రి
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
By Medi Samrat
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్లే ఏపీకి విపత్తులు అని ఆరోపించారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2025 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని.. 2014, 15, 16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని గుర్తుచేశారు.
తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరాతీశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నట్లు సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి ఆరా తీశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వ చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగు శిక్షణనిచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు వైద్యశాఖ అధికారి పేర్కొన్నారు. వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు. ఎండలు, వడగాల్పులపై అవగాహన పెంచాలన్నారు.
సచివాలయం, వార్డు సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 నగరాలలో వడగాల్పుల అప్రమత్తత దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని.. వడగాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
ముందస్తు వర్షాలు వస్తే జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని.. బుడమేరు వరదల వంటి ఇబ్బందులు రాకుండా సంసిద్ధంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు. ప్రజా క్షేమం కోసం అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడమే విపత్తులకు కారణం అన్నారు. గ్రామస్థాయిలో ఆపదమిత్రలను సంసిద్ధంగా ఉంచాలని ఎస్టీఆర్ఎఫ్, ఫైర్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు సంభవించినపుడు గోల్డెన్ అవర్ లో వీలైనన్ని ప్రాణాలు కాపాడాలన్నారు. ఆపదమిత్రలకు శిక్షణనిచ్చి సీపీఆర్ సహా మెళకువలు నేర్పడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలకు ఆర్థిక సాయం పెంపుపై చర్చించారు.