ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీనిని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది.
పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనపడడం లేదని స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలుపెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా.. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు పదవులకు రాజీనామా చేసి.. ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.