తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతిసవాళ్లు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి పై తాడిపత్రి, అనంతపురం పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు.రాజకీయ నాయకుల వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.