జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. 'కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు' అంటూ వందలాది యువకులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు వెంబడించారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని కొంతమంది యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు.
ఓ ఆందోళనకారుడు అమలాపురం ఆస్పత్రి వద్ద పోలీసు జీపుపై రాయి విసిరాడు. ఆందోళనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లతో దాడి జరిగింది. రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో ఎస్పీ సుబ్బారెడ్డి అమలాపురంలో క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎస్పీ సుబ్బారెడ్డి ఆందోళనకారులను చెదరగొట్టారు.