ఇంకొన్ని వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇచ్చిన సంగతి తెలిసిందే!! అయితే ఆ ఎన్నికల గుర్తును తొలగించి, దానిని ఉచిత చిహ్నంగా చేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. JSP ఎన్నికల గుర్తుపై దాఖలైన పిటిషన్‌లను తక్షణమే కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది.
గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టు తీర్పుతో గ్లాసు గుర్తు తమకే దక్కడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు గాజుల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించే విషయంలో ఎలాంటి జోక్యం ఉండబోదని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది.