అందులో జోక్యం చేసుకోలేము: ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 28 Nov 2024 3:42 AM GMTఅందులో జోక్యం చేసుకోలేము: ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది, అలాంటి నిర్ణయాలు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పరిపాలనాపరమైన ప్రత్యేకాధికారం కిందకు వస్తాయని వివరించింది.
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ. పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై జస్టిస్ జి. నరేందర్, జస్టిస్ టి. చంద్ర ధన శేఖర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. గతంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీని ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, అప్పుల భారం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని పాల్ వాదించారు.
ప్రత్యేక కేటగిరీ హోదా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఉపాధిని సృష్టిస్తుందని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుందని పాల్ చెప్పారు. అయితే, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం రుణాలు తీసుకోవడం ఒక సాధారణ విషయమని కోర్టు తెలిపింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు పిటిషనర్ వాదనలకు కౌంటర్ ఇచ్చారు, ప్రత్యేక హోదా హామీ మౌఖికంగా ఉందని, పార్లమెంటులో అధికారిక డాక్యుమెంటేషన్ లేదా వ్రాతపూర్వక నిబద్ధత లేదన్నారు. తదుపరి విచారణను డిసెంబర్ 11కి బెంచ్ షెడ్యూల్ చేసింది.