వివేకా హత్య కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
High Court Orders on Viveka Murder Case. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం హైకోర్టు కీలక
By Medi Samrat Published on 11 Nov 2020 1:44 PM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులను వెంటనే సీబీఐకి అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించన సీబీఐ స్థానికంగా దర్యాప్తు చేసిన పోలీసులను సైతం విచారించింది.
ఈ క్రమంలో పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సీబీఐ అధికారులు భావించారు. వివేకా హత్యకు సంబంధించి తమకు రికార్డులు ఇవ్వాలని సీబీఐ అధికారుల బృందం పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. దీంతో సీబీఐ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలంటూ పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాటి సీఎం చంద్రబాబు ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించారు.
సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, పలు అనుమానాలు ఉన్నాయని.. సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ చెల్లెలు, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.