ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

High court orders on video recording on election counting.ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 Feb 2021 4:11 PM IST

High court orders on video recording on election counting

ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట‌రు కోరితే వీడియో తీయాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆ ప్రక్రియను వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా.. ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే.

ఎన్నికల కౌంటింగ్‌లో వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ విచారణలో ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.

దాంతో జస్టిస్ సోమయాజులు ధర్మాసనం స్పందిస్తూ.. సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలంటూ ఈ కేసును నేటికి వాయిదా వేసింది. మంగ‌ళ‌వారం తుది తీర్పు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను వీడియో తీయాల‌ని ఏదైనా పంచాయ‌తీలో ఒక్క ఓట‌రు కోరినా సంబంధిత పంచాయ‌తీలో వీడియో తీయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియో గ్ర‌ఫీ విష‌యంలో ఎస్ఈసీ ఆదేశాలు పాటించాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది.




Next Story