విశాఖ గర్జన సమయంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి జనసేన కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం విశాఖపట్నం జైలులో వున్న జనసేన నాయకులు విడుదల కానున్నారు. విశాఖ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా.రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసును బనాయించిందని మండిపడ్డారు. హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారని.. వారికి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని పవన్ తెలిపారు. తాము ఎప్పుడూ న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా విశ్వసిస్తామని, ఆ నమ్మకంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించామన్నారు.