తుఫాన్ దృష్ట్యా ఏపీలో హైఅలర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 3 Dec 2023 12:57 AM GMTతుఫాన్ దృష్ట్యా ఏపీలో హైఅలర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. తుపాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటి ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు సమాచారం అందించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, బాధిత ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
తీరప్రాంతాల నుంచి బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, పాలు, తాగునీరు, ఆహారం సరిపడా నిల్వలు ఉంచుతూ సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన వారికి చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున సహాయ చర్యల కోసం ప్రభుత్వం విడుదల చేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంపై లోతైన అల్పపీడనం డిసెంబర్ 2 నాటి 0600 UTC వద్ద, నెల్లూరుకు ఆగ్నేయంగా 540 కి.మీ, బాపట్లకు 650 కి.మీ దక్షిణ-ఆగ్నేయ , మచిలీపట్నానికి 650 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.
ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను డిసెంబర్ 5వ తేదీన 0600 UTC సమయంలో నెల్లూరు,మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉంది. ఇదిలావుండగా, తుపాను వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆస్తినష్టం అరికట్టాలని కోరారు.
తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను కోరారు.