Gandhi Jayanti 2023: తెలుగు నేలపై బాపూ నడయాడిన ప్రాంతాలు ఇవే
జాతిపిత బాపూ పాదస్పర్శతో మన తెలుగునేలపై అనే ప్రాంతాలు పునీతమయ్యాయి. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా ఆ ప్రాంతాలు, అక్కడ బాపూ ఇచ్చిన సందేశాలు మీ కోసం
By అంజి Published on 2 Oct 2023 8:05 AM ISTGandhi Jayanti 2023: తెలుగు నేలపై బాపూ నడయాడిన ప్రాంతాలు ఇవే
తెల్లవాడి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసిన అహింసా యోధుడు.. బాపూజీ మహాత్మ గాంధీ. అక్టోబరు 2న ఆయన జయంతి. జాతిపిత బాపూ పాదస్పర్శతో మన తెలుగునేలపై అనే ప్రాంతాలు పునీతమయ్యాయి. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా ఆ ప్రాంతాలు, అక్కడ బాపూ ఇచ్చిన సందేశాలు మీ కోసం
హైదరాబాద్‌లో బాపూజీ యాత్ర
మహాత్ముడు తొలిసారి 1927 ఏప్రిల్ 7న వివేకవర్ధిని హైస్కూల్‌లో జరిగిన సభకు హాజరై ఓ చిన్న వేదికపైనే కూర్చొని సందేశమిచ్చారు. నాటి ఆ వేదిక నేటికీ ఆ స్కూల్‌లో భద్రంగా ఉంది. మలిదఫాలో 1934లో మార్చి 9న కర్బలా మైదానంలో జరిగిన సభకు హాజరై అంటరానితనం పాపమని ప్రభోధించారు.
అనంతపురం జిల్లా
తొలిసారి 1921, సెప్టెంబర్ 20న తాడిపత్రిలో జాతీయనిధి సేకరణకు వచ్చిన బాపూ హిందూముస్లింల ఐక్యత కావాలని, జూదం, మద్యం, వ్యభిచారం, అస్పృశ్యత వద్దని పిలుపునిచ్చారు. రెండవసారి 1929, మే 16న జరిగిన బాపూ పర్యటనలో వేలాదిమంది మిల్లువస్త్రాలు తగలబెట్టి ఖద్దరు ధరించారు. మూడవసారి.. 1934లో గుత్తి, ఉరవకొండ, హిందూపురం సభల్లో మాట్లాడుతూ.. అంటరానితనం పోవాలని, అప్పటి వరకు తన మనసుకు శాంతి లేదని ఆవేదన చెందారు.
తూర్పు గోదావరి జిల్లా
బాపూజీ 1921, మార్చి 30న, అదే ఏడాది ఏప్రిల్ 4 న రెండవసారి, మూడవసారి 1929 మే 6న, నాల్గవసారి 1933 డిసెంబర్ 25, 1946 జనవరి 20న.. ఇలా ఏకంగా ఐదు సార్లు రాజమహేంద్రవరం వచ్చారు. 1929, 1933లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. 1929 మే 6న పాల్ చౌక్ (ఇన్నీస్‌పేట) సభలో నాడు గాంధీజి విడిది చేశారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ కూడా తన పర్యటన సందర్భంగా ఇదే భవనంలో బస చేయడం విశేషం
పశ్చిమ గోదావరి జిల్లా
కాంగ్రెస్ నేత మాగంటి అన్నపూర్ణమ్మ కోరిక మేరకు బెజవాడ ఏఐసీసీ మీటింగ్ నుంచి సతీసమేతంగా గాంధీజీ 1921 మార్చిలో ఏలూరు వచ్చారు. పౌరసన్మానం పొంది, టౌన్‌హాలు సభలో పాల్గొన్నారు. మరుసటి నెల యంగ్ ఇండియా పత్రికలో 'తెలుగువారు బలవంతులు, ఉదారవాదులని' ప్రస్తావించారు. 1929 పర్యటనలో 48 గ్రామాల్లో 250 మైళ్ల దూరం ప్రయాణించారు. మూడోసారి 1933 డిసెంబర్ 26న అంటరానితనం నిర్మూలనకై జిల్లాలో పర్యటించారు.
కృష్ణా జిల్లా
బాపూ ఏడుసార్లు విజయవాడలో పర్యటించారు. తొలిసారి 1919, మార్చి 31న రామ్మోహన్ రాయ్ లైబ్రరీలో సత్యాగ్రహంపై ఉపన్యసించారు. 1920, ఆగస్టు 23న సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా, ఏప్రిల్ 21, 1921లో బెజవాడ ఏఐసీసీ మీటింగ్ కోసం మూడోసారి, నాలుగోసారి ఏప్రిల్ 10, 1929న ఖద్దరు ప్రచారం కోసం, ఐదోసారి 16 డిసెంబర్, 1933 హరిజనోద్ధరణ పేరిట, 1937 జనవరి 23న గుంటూరు నుంచి తిరుగు ప్రయాణంలో, హిందీ ప్రచార సభ కార్యక్రమం కోసం 1946, జనవరి 21న చివరిసారి వచ్చారు.
శ్రీకాకుళం జిల్లా
1921 బెజవాడ ఏఐసీసీ మీటింగ్ వేళ కాంగ్రెస్ నేతలు పొందూరు ఖద్దరును బాపూకు ఇచ్చారు. పొందూరు ఖాదీ, అక్కడి కార్మికుల నైపుణ్యంపై బాపూ మరుసటి నెల యంగ్ ఇండియాలో సంపాదకీయం రాశారు. 1927, డిసెంబర్ 2న పూండి రైల్వే స్టేషన్ దగ్గర నౌపడ ఉప్పు రైతులతో సమావేశం అయ్యారు. మర్నాడు మెళియాపుట్టిలో ఖాదీ షాపును ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942లో దూసి రైల్వే స్టేషన్‌లోనే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
నెల్లూరు జిల్లా
బాపూజీ ఐదుసార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు. 1921లో పల్లెపాటు పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించి, హరిజనులకు గ్రామ ప్రవేశం కల్పించారు. నెల్లూరు టౌన్‌హాలులో తిలక్ ఫొటోను ఆవిష్కరించారు. అనంతరం 1929, 1933లోనూ కావలి ప్రాంతాల్లో పర్యటించారు. 1946లో చెన్నై వెళ్తూ వచ్చారు. టౌన్‌హాల్‌లో బాపూజీ మీటింగ్, వీఆర్ కాలేజీలో జరిగిన సభలు, పొణకా కనకమ్మ స్థాపించిన కస్తూర్బా బాలికల విద్యాలయం నేటికీ బాపూ గుర్తులుగా ఉన్నాయి.
కర్నూలు జిల్లా
1921, 1929లో రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. తొలిసారి జాతీయ నిధికి విరాళాల సేకరణకు 1921, సెప్టెంబర్ 30న కర్నూలు వచ్చి, ఓపెన్ టాప్ జీపులో ప్రధాన వీధుల గుండా సాగుతూ.. విరాళాలు స్వీకరించారు. రెండవసారి 1929 మే 21న సతీసమేతంగా ఖద్దరు నిధి విరాళాల సేకరణకు ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, కర్నూలు, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల్లో పర్యటించారు.
వరంగల్ జిల్లా
సమరయోధుడు భండారు చంద్రమౌళీశ్వర్ రావు అభ్యర్థన మేరకు గాంధీజీ 1946 ఫిబ్రవరి 5న వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగారు.జాంషాహి మిల్లు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తర్వాత స్టేషన్ రోడ్ ప్రాంతాన్ని సందర్శించారు. తర్వాత అదే స్థలంలో స్థానికులు బాపూజీ భవనాన్ని నిర్మించారు. 1946 లో గాంధీజీ ఖమ్మం వచ్చారు. ఆనాడు ఖమ్మం, వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఖమ్మం సభలో గాంధీజీ చేసిన ప్రసంగాన్ని బొమ్మకంటి సత్యనారాయణ గారు తెలుగులోకి అనువాదం చేశారు.