ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పెంపు.. ఎవరికి ఎలా అంటే?

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచుతామన్న ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు.

By అంజి  Published on  14 Jun 2024 6:47 AM IST
pension hike, Andhra Pradesh, APGovt, CMChandrababu

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పెంపు.. ఎవరికి ఎలా అంటే?

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచుతామన్న ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పెన్షన్‌ పెంపు ఫైలుపై సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్‌ఐవీ బాధితులు, హిజ్రాలకు గతంలో రూ.3 వేలు పెన్షన్‌ ఇచ్చే వారు. ఇప్పుడు రూ.4 వేల పెన్షన్‌ అందనుంది. దివ్యాంగులకు గతంలో రూ.3 వేల పెన్షన్ ఇవ్వగా.. ఇప్పుడు రూ.6 వేలు అందించనున్నారు. కుష్టుతో వైకల్యం సంభవించినవారికి రూ.6 వేల పెన్షన్ ఇవ్వనున్నారు.

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్‌ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు గతంలో రూ.5 వేలు అందగా.. ఇప్పుడు రూ.10 వేలు అందించనున్నారు. మంచానికి పరిమితమైన వారికి గతంలో రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వగా.. ఇప్పుడు రూ.15 వేల పెన్షన్‌ ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ లెక్కన ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలకు బకాయి రూ.3 వేలతో పాటు జూలై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్‌తో కలిపి ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందనున్నారు. పెన్షన్‌ మొత్తం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.650 కోట్ల దాకా అదనపు భారం పడనుంది.

Next Story