నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం నాడు తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు అల్పపీడనం హెచ్చరికతో రైతుల్లో అలజడి మొదలైంది. రైతులు తమ పంటను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.