అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.