వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని హెచ్చరించింది.
అటు విశాఖపట్నంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 08912590102, 089125901800, 0912565454 నంబర్లకు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయవచ్చని సూచించారు. అటు గోపాలపట్నం రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో ఇళ్లలోని వారిని ఎమ్మెల్యే గణబాబు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై డింది. వర్షం కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో పలు ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు - వైజాగ్ మధ్య నడవాల్సిన 2 విమానాలతో పాటు మరో 5 విమానాలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుడులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు కుండపోత వర్షాలు కురుస్తున్న విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.