భారీ వర్షాలు.. నెల్లూరు జిల్లాకు హై అలర్ట్‌.!

Heavy rains in Nellore district .. High alert issued by the authorities. ఏపీలోని నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు, తమిళనాడులోని జిల్లాలను వరుణుడు వణికిస్తున్నాడు.

By అంజి  Published on  29 Nov 2021 11:09 AM IST
భారీ వర్షాలు.. నెల్లూరు జిల్లాకు హై అలర్ట్‌.!

ఏపీలోని నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు, తమిళనాడులోని జిల్లాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాల కారణంగా వరదలు లోతట్టు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో కండలేరులో నీటిని విడుదల చేయడంతో పంబలేరు వాగు భారీ వరదతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు దగ్గర నేషనల్‌ హైవేపైకి వరద నీరు చేరింది. అలాగే గూడూరులో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. రోడ్డుపైకి వరద ప్రవాహం చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మనుబోలు, పొదలకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వరదల కారణంగా కిలోమీటర్ల కొద్ది వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. అలాగే గుడూరు వెంకటగిరికి కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌ భారీ వరదతో నీట మునిగింది. బస్సు డిపోలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బస్సునుల వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వరదల కారణంగా కండలేరు ప్రాజెక్టు ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. ఏ సమయంలోనైనా కట్ట తెగిపోతుందేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కండలేరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీలకు నీరు చేరుకుంది. మరో వైపు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలిస్తున్నారు.


Next Story