ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం నేపథ్యంలోనే గత 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ ఉదయం 16వ నెంబర్ నేషనల్ హైవేపై భారీ వరద ప్రవాహంతో గూడూరు - మనుబోలు మధ్య వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు కండలేరు డ్యామ్ నుండి వరద పోటెత్తుతోంది. దీంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు పూర్తిగా నిండిపోయి వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు కేత మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మర్రిపాడు మండలం పి.నాయుడుపల్లి, చుంచులూరు గ్రామాలకు మధ్య రాకపోకలు గత రెండు రోజులుగా నిలిచిపోయాయి. దీంతో 500 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఇక ఈ రెండు గ్రామాల్లో ఉన్న చెరువులు సైతం ప్రమాదకర స్థాయిలో నీటితో నిండి ఉన్నాయి. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల కారణంగా నాయుడుపేటలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా ఇళ్ల చుట్టూ నీళ్లు చేరాయి. దీంతో అవి కూలిపోతాయోమనని ప్రజలు భయపడుతున్నారు. ఇక పాడి పశువులు మేత లేక ఆకలితో ఆలమటిస్తున్నాయి. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు అంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1,15,396 క్యూసెక్కులుగా ఉంది.