పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
కాగా ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.