ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏపీ తీరం పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు (మార్చి 20, శుక్రవారం) దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అప్రమత్తం చేశారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రైతులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.