తెలంగాణ, ఏపీలకు భారీ వర్ష సూచన

Heavy rain forecast for Telangana and AP. తెలంగాణ ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అయితే ఆ వర్షాలను కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి

By అంజి  Published on  18 July 2022 8:18 AM IST
తెలంగాణ, ఏపీలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో..

తెలంగాణ ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అయితే ఆ వర్షాలను కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చింది. ఒడిశా తీరం దగ్గర కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ అధికారి డాక్టర్ నాగరత్న చెప్పారు. నిన్నటి వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో

అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


Next Story