గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది. టీడీపీ కార్యాలయంలో పని చేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. నిందితుల నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాలని, దీని కోసం వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే.. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను కూడా రేపటికి కోర్టు వాయిదా వేసింది. జైలులో వల్లభనేని వంశీకి అందిస్తున్న వసతుల ఏమిటో తెలియజేయాలని జైలు సూపరింటెండెంట్‌ను జడ్జి కోరారు. కాగా జైలు అధికారులు సమర్పించే వివరణ ఆధారంగా వసతుల కల్పనపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.