ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీకి, పార్టీకి జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. కొంతకాలంగా ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈవివాదం నేపథ్యంలో జీవీరెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజీనామా లేఖలో.. ‘‘వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు’ అని రాజీనామా లేఖలో జీవిరెడ్డి పేర్కొన్నారు.