మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణస్వామిలపై దాడి కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి ప్రయత్నిస్తున్నారు. మాచర్ల కోర్టు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి పిటిషన్లపై గుంటూరు కోర్టు విచారణ జరిపి.. తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా గుంటూరు కోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీపీ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. పిన్నెల్లికి నేర చరిత్ర ఉందని.. ఈ కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని అశ్విని కుమార్ తెలిపారు. పిన్నెల్లి పోలీసు విచారణకు సహకరించడంలేదని.. బెయిల్ ఇవ్వొద్దని కోరారు.