అది జగన్ ఇల్లు కాదు.. ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం
రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ శ్రేణులకు సూచించారు.
By Medi Samrat
రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలని ఆయన కోరారు. రుషికొండ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమన్న అమర్ నాథ్.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని వెల్లడించారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాకే భవనాలు నిర్మించామని వివరణ ఇచ్చారు. రాష్ట్రప్రతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి ఆతిథ్యానికి వాటిని వాడుకోవచ్చని సూచించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, ఆయన కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని అన్నారు. హైదారాబాద్ లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్‌లో ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే.. వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే.. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలని సవాల్ చేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవుపలికారు.
రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని.. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధానిని స్వాగతించిన గంటాకు నగరంలో ఒక్క ప్రభుత్వ అతిధి గృహం కూడా లేదన్న విషయం తెలియదా? స్థానిక శాసనసభ్యుడిగా రుషికొండ ఎదురుగా 25 ఎకరాలు ఆక్రమించుకున్న గీతం యూనివర్సిటీకి గంటా ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరునెలలు విమర్శలు చేయకూడదని అనుకున్నా.. టీడీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు పెట్టగా లేని అభ్యంతరం.. ఈ భవనాలకు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.