అమరావతి: రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తమకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులు ఉన్న వారికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. వచ్చే నెల నుంచి రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను కూడా పంపిణీ చేయనుంది.
నవంబర్ నెల నుంచి కార్డుపై కిలో రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకిలో రూ.17 చొప్పున విక్రయించనున్నారు. బయట మార్కెట్‌లో కిలో పంచదార రూ.50, కందికప్పు ధర రూ.180 వరకు ఉంది. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. జనవరి నుంచి ఈ సరకుల్ని కూడా రేషన్‌తో పాటుగా పంపిణీ చేయాలని భావిస్తోంది. నిత్యావసరాల ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.