AP Assembly: రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గవర్నర్
విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు.
By అంజి Published on 22 July 2024 11:22 AM ISTAP Assembly: రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గవర్నర్
అమరావతి: విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అశాస్త్రీయ విభజనతో ఏపీకి నష్టం జరిగిందన్నారు. వైసీపీ ప్రతీకార రాజకీయాలతో రాష్ట్రం ఒడిదొడుకులను ఎదుర్కొందని, ఇప్పుడు తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపారు. ఏపీ ప్రజలు సుదీర్ఘ కాలం అభివృద్ధికి నోచుకోలేదని ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారని తెలిపారు. చంద్రబాబు విజనరీ నాయకుడని అన్నారు.
2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని గవర్నర్ తెలిపారు. 2014 - 2019 మధ్య రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, అప్పటి నుంచి అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. పెట్టుబడులు పక్కదారి పట్టాయి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది అని వివరించారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తీవ్రంగా కలత చెందారని అన్నారు. రివర్స్ టెండరింగ్‌తో తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు.
ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం రూ.లక్షా 6 వేల 176 కోట్లు ఉండగా.. విభజిత ఏపీలో తలసరి ఆదాయం రూ.93 వేల 121 కోట్లకు పడిపోయిందన్నారు. విభజన చట్టం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తగినంత పరిహారం అందలేదని అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్నారు. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందన్నారు. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యా సంస్థలను విభజించారని, ఫలితంగా ఉన్నత విద్యా సంస్థలు కోల్పోయామని గవర్నర్ వెల్లడించారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని పేర్కొన్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ 75 శాతం పూర్తైందని గవర్నర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్న్ర్ తెలిపారు.