అమరావతి: పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మేరకు విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారీ కోసం ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ గైడెన్స్ నిపుణులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా విద్యార్థులను ఉత్తమ భవిష్యత్ వైపు మార్గనిర్దేశనం చేసేందుకు అవకాశం ఉంటుంది.
యూనిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా టీచర్లకు కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను నేటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఇవ్వనుంది. మొదట తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అందిస్తామని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు సమర్థవంతంగా విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసేందుకు వీలు ఉంటుందని తెలిపారు.