సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By - Knakam Karthik |
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. పది మంది మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా..ఇందులో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి,గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
కాగా గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్దతులపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మిడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని, ఇంటర్మిడియరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని జీవోఎంను ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కల్గిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని, పదోన్నతుల తర్వాత హేతుబద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్దతి పై చర్చించాలని, వీలైనంత త్వరగా అధ్యయనంపూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.