Andrapradesh: 'అందరికీ గృహ నిర్మాణం' కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో గృహనిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik
Andrapradesh: 'అందరికీ గృహ నిర్మాణం' కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో గృహనిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. “అందరికీ గృహ నిర్మాణం” కార్యక్రమం అమలును పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ముగ్గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణలతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉప సంఘం కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించింది. క్షేత్ర స్థాయిలో ఉన్న పలు సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఆర్టీజీఎస్ ఆధారంగా లబ్దిదారుల గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానంపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్లు కేటాయించే విధానాలపై అధ్యయనం, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అంశంపై చర్చించాలని సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారంపై చర్చించాలని సూచించడంతో పాటు.. గత ప్రభుత్వం జగనన్న కాలనీల్లో కేటాయించి, నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాల వినియోగంపై చర్చ చేయాలని చెప్పింది. క్షేత్ర స్థాయి సమస్యలను పరిష్కారం కోసం సరైన మార్గదర్శకాలు సబ్ కమిటీ రూపొందించనుంది. వీలైనంత త్వరలో అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని సబ్ కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.