ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By - Knakam Karthik |
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్
ఉండవల్లి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకుని మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను (మ్యూచువల్, స్పౌజ్) విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న భాషా పండితుల సమస్యను పరిష్కరించడం పట్ల మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేకంగా కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తిచేశాం. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. గత ప్రభుత్వం మాదిరిగా విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టి దొంగలెక్కలు చూపబోం. పారదర్శకంగా వ్యవహరిస్తాం. విద్యాశాఖను ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలి. అభ్యసన ఫలితాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. దీనిని అధిగమించేందుకు కృషిచేస్తున్నాం. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాం. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. విద్యావ్యవస్థలో మార్పునకు మీ అందరి సహకారం కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.