ఏపీలో వరద సాయంపై ప్రభుత్వం ఫోకస్.. బాధితులకు రూ.25,000 సాయం

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25 వేలు, కొంత వరకు మునిగిన ఇళ్లకు రూ.10 వేల సాయం అందించనున్నట్టు తెలుస్తోంది.

By అంజి  Published on  11 Sept 2024 6:58 AM IST
Government, flood victims, Andhra Pradesh, Vijayawada

ఏపీలో వరద సాయంపై ప్రభుత్వం ఫోకస్.. బాధితులకు రూ.25,000 సాయం

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25 వేలు, కొంత వరకు మునిగిన ఇళ్లకు రూ.10 వేల సాయం అందించనున్నట్టు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10 వేలు, బైకులకు రూ.3 వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది.

పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం తన ఆర్థిక వెసులుబాటు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరద నష్టం, అంచనాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

సీఎం చంద్రబాబు ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తొలుత ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజుపాలోంలో పొలాలను పరిశీలిస్తారు.

అటు తెలుగు రాష్ట్రాల్లోని వదర ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సారథ్యంలో రెండు బృందాలు ఏపీకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ కీర్తి ప్రతాప్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో పర్యటించనుందింది.

Next Story