రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో తానే అందరికంటే సీనియర్ అని, మంత్రి పదవి దక్కనందుకు తనకేమీ బాధలేదని అన్నారు. రాజకీయపరంగా చూస్తే చంద్రబాబు తనకంటే సీనియర్ కావొచ్చేమో కానీ, టీడీపీలో మాత్రం చంద్రబాబు కంటే తానే సీనియర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది 1982లో అని, అప్పటినుంచి తాను పార్టీలో ఉన్నానని వివరించారు. పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం నిలబడ్డానని అన్నారు.
మొన్నటి ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇస్తారేమోనని ఆశించాను.. కానీ ఇవ్వలేదు. వివిధ సమీకరణాలో, ఇంకేమైనా సామాజిక కారణాలో.. నాకనవసరం. అంతమాత్రాన అసంతృప్తి చెందాల్సిన పనిలేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను అన్నారు. నేను మొదటి నుంచి ఎన్టీఆర్ భక్తుడ్ని.. రామారావు గారి కోసం ఆఖరుదాకా ఉన్నాను.. ఉంటాను కూడా.. 1996లో రామారావు గారి కోసం పోరాటం చేశాను.. ఆ తర్వాత చంద్రబాబు పిలుపు మేరకు మళ్లీ టీడీపీలోకి వచ్చాను. అప్పటి నుంచి పార్టీలో బీఫారాలు ఇస్తున్నారు.. గెలుస్తున్నాను.. అలా జరిగిపోతూ ఉందని అన్నారు. రామారావుకు విధేయుడ్ని, చంద్రబాబుకు వ్యతిరేకిని అనే ముద్రతో మంత్రి పదవి ఇవ్వడంలేదు అనే వాదనలో నిజం లేదని అన్నారు.