అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు
ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని
By అంజి Published on 14 Jun 2023 12:28 PM IST
అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని తాడి, అనకాపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. బొగ్గుతో కూడిన గూడ్స్ రైలు తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. ఈ ఘటన కారణంగా దక్షిణ మధ్య రైల్వే కనీసం ఆరు రైళ్లను రద్దు చేసింది.
మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. బుధవారం ప్రయాణం ప్రారంభించాల్సిన కింది రైళ్లు రద్దు చేయబడ్డాయి. రైలు నంబర్ 12805 విశాఖపట్నం-లింగంపల్లి, 22701 విశాఖపట్నం -విజయవాడ, 22702 విజయవాడ-విశాఖపట్నం, 17240 విశాఖపట్నం-గుంటూరు రైళ్లు రద్దు చేయబడ్డాయి. గురువారం బయలుదేరాల్సిన రెండు రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. 12806 లింగంపల్లి-విశాఖపట్నం, 17239 గుంటూరు-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి.
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20833) బుధవారం తెల్లవారుజామున 5.45 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో రైలు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 280 మందికిపైగా మృతి చెందగా, 1100 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.